Followers

Saturday 24 March 2018

ఎంత గుంజినా గంజి స్థాయే!

                    జరిగిన కథ  

గట్టు కాడ:

అది 'ఓ స్త్రీ రేపు రా ' అనే వాక్యం ప్రతి గుమ్మం ముందర వెలిసిన రోజులు .నేను ,సత్తి గాడు కలిసి ఊళ్ళో ఉన్న గుడి పక్కల గట్టు మీద కూర్చొని ఆ వాక్యం వెనకాల ఉన్న సంఘటని కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళం.కానీ ఆ చీముడి ముక్కు సత్తి గాడు ఎప్పుడు జేరిగింది జెరిగిన దానిలా చెప్పడు.ముందు గుడికి వెళ్లి దండం పెట్టుకుని హారతి పళ్ళంలో మా వంతు హస్త వాసి చూపించాం(పెట్టడం కాదు తీయడం).మా జేబులు ధులిపితే 1 రూపాయి 25 పైసలు రాలాయి.వెంటనే వాటితో నారెంజు మిఠాయి ,నువ్వుల ఉండ కొనుక్కుందాం అని గట్టు పక్కల కొట్టుకు వెళ్ళాం.ఆ రోజు 12:00 కావడం తో గుడి మూసేసారు అందుకు ఆ కొట్టు వాడికి గిరాకీ లేదు . మేము కబుళ్ళల్లో గట్టివాళ్ళం కానీ గణితం లో కాదు.10పైసలకి ఒక్క నారెంజు మిఠాయి ,15పైసలకి ఒక్క నువ్వుల ఉండ. కానీ ఆ 1రూపాయి 25 పైసలలో 25 పైసలు నేను అమ్మ పొదుపు చేసే పోపుల డబ్బాలో పోపులు అనుకుని తీసినవి(వీలైతే నమ్మండి).30 పైసలు ఆ సతిగాడు గోలిలు ఆడి 70పైసలు పోగొట్టుకున్న రూపాయి లోనివి.మిగతావి గుడి లో దేవుడు మా పై జాలి చూపించి మా ముందు పెట్టిన పళ్ళం లో ఉంచినవి.ఇప్పుడు మేము వేసుకున్న లెక్క ప్రకారం ఒక 10 నారెంజు మిఠాయి (చెరొక 5),3నువ్వుల ఉండలు(2సత్తి గాడికి,1నాకు) అనుకున్నాం.కొట్టుకు వెళ్ళాం ,ఎన్ని కావాలో ఆడిగాం మొత్తం ఇచ్చిండు,మా దెగ్గర ఉన్న పైసలు మొత్తం ఇచ్చాo. ఇంకొక 20 పైసలు ఇయ్యాలి అని ఆ ఎత్తు పళ్ళ కొట్టువాడు అన్నడు. చిన్నపిల్లలం అని మోసం చేస్తున్నాడు అని నమ్మి మేము అక్కడ నుంచి పారిపోయాం.

ఇంట్లో: 

మా ఇంటి దొడ్లో కి వెళ్ళాం . పిడకల గోడ,పెచ్చూల మేడ మీద సత్తి గాడు తను ముడి కట్టిన అంగీ ని ధులిపితే ఆ నారెంజు మిఠాయి,నువ్వుల ఉండలు రాలాయి.వాటిని తినుకుంటూ కొట్టులో వచ్చిన కొత్త  గోళీల గురించి మాట్లాడుకున్నాం.వెంటనే ఏంకాయమ్మ ఇంట్లో ఒక పెద్ద పిడుగు పడిందని దేవుడు ఏంకాయమ్మని తీస్కెళ్ళిపోయాడని వాళ్ళ నానమ్మ చెప్పింది అని సత్తి గాడు అన్నాడు.ఎప్పుడు దేవుడిని తలుచుకునే మన లెక్కల మాష్టారుని ఎందుకు వదిలేసాడని దేవుడిని తిట్టుకున్నాం.ఇంతలో సత్తి గాడు నువ్వుల ఉండ పొట్లం తెరిచిండు ,దాంతో నా నోట్లో ఉన్న నారింజు మిఠాయి ని పెచ్చుల మేడ మీద జాగ్రత్తగా పెట్టి ఆ నువ్వుల ఉండని నాకుతూ తిన్నాను. అది మొత్తం తిన్నాక నేను ఆ కింద పెట్టిన నారెంజు మిఠాయి ని తినబోతే సత్తి గాడు నన్ను తిట్టి "ఒరేయ్ ! దానికి సున్నం అంటుకుందిరా అలాగే తింటావా ? శుభ్రం చేసి ఇస్తా ఇక్కడ ఇయ్యి "అని.ముందు వాడి చీముడి ముక్కు చేతితో తుడుచుకుని అదే చేతితో నా నారెంజు మిఠాయి ని తీసుకుని వాడి కుడి కాలికి ఆ సున్నం పోయేంతవరకు రుద్ది ఇచ్చాడు.వాడు లేకుంటే తీక్కొడి లాగా ఆ నరేంజు మిఠాయి ని అలాగే తినేవాడిని అనుకున్న.ఈసారి నారెంజు మిఠాయి ఎందుకో ఉప్పగ అయ్యింది.ఇంతలో మొదట అనుకున్న విధంగా కాకుండా నేను రెండు నువ్వుల ఉండలు తీసుకుందాం అనుకున్న కానీ సత్తి గాడిని అడిగితే ఒప్పుకోడు అందుకు నేను ఆ పొట్లం లో ఉన్న నువ్వుల ఉండ ని తీసుకొని కిందికి పరిగెత్తడం మొదలుపెట్టాను.నా వెనకాల వాడు తరుముకుంటు వచ్చాడు.గుమ్మం వైపు ఉరుకుతూ వెనకాల వాడు ఉన్నడెమో చూద్దాం అని వెనకకు తిరిగి చూస్తుంటే మా నాన్న కి తట్టుకుని కింద పడ్డాను.కళ్ళు మెల్లగా తెరిస్తే మా నాన్న పంచ ఎదురుగా ఎత్తు పళ్ళ కొట్టువాడు ఉన్నాడు.లెక్కలు మాకు సరిగ్గ రావని అప్పుడు నాకు అర్థం అయింది.
                  మా నాన్న హస్త రేఖలు అద్భుతంగా ఉన్నాయని నా వీపు చూసి నువ్వుల ఉండ తింటూ సత్తి గాడు అన్నాడు.ఆ 20పైసలు ఇచ్చేసి కొట్టువాడిని మా నాన్న పంపించాడు.అప్పుడే తెలిసింది మా నాన్న కూడా 'కొట్టు'వాడు అని.




No comments:

Post a Comment