Followers

Saturday 24 March 2018

ఎంత గుంజినా గంజి స్థాయే!

                    జరిగిన కథ  

గట్టు కాడ:

అది 'ఓ స్త్రీ రేపు రా ' అనే వాక్యం ప్రతి గుమ్మం ముందర వెలిసిన రోజులు .నేను ,సత్తి గాడు కలిసి ఊళ్ళో ఉన్న గుడి పక్కల గట్టు మీద కూర్చొని ఆ వాక్యం వెనకాల ఉన్న సంఘటని కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళం.కానీ ఆ చీముడి ముక్కు సత్తి గాడు ఎప్పుడు జేరిగింది జెరిగిన దానిలా చెప్పడు.ముందు గుడికి వెళ్లి దండం పెట్టుకుని హారతి పళ్ళంలో మా వంతు హస్త వాసి చూపించాం(పెట్టడం కాదు తీయడం).మా జేబులు ధులిపితే 1 రూపాయి 25 పైసలు రాలాయి.వెంటనే వాటితో నారెంజు మిఠాయి ,నువ్వుల ఉండ కొనుక్కుందాం అని గట్టు పక్కల కొట్టుకు వెళ్ళాం.ఆ రోజు 12:00 కావడం తో గుడి మూసేసారు అందుకు ఆ కొట్టు వాడికి గిరాకీ లేదు . మేము కబుళ్ళల్లో గట్టివాళ్ళం కానీ గణితం లో కాదు.10పైసలకి ఒక్క నారెంజు మిఠాయి ,15పైసలకి ఒక్క నువ్వుల ఉండ. కానీ ఆ 1రూపాయి 25 పైసలలో 25 పైసలు నేను అమ్మ పొదుపు చేసే పోపుల డబ్బాలో పోపులు అనుకుని తీసినవి(వీలైతే నమ్మండి).30 పైసలు ఆ సతిగాడు గోలిలు ఆడి 70పైసలు పోగొట్టుకున్న రూపాయి లోనివి.మిగతావి గుడి లో దేవుడు మా పై జాలి చూపించి మా ముందు పెట్టిన పళ్ళం లో ఉంచినవి.ఇప్పుడు మేము వేసుకున్న లెక్క ప్రకారం ఒక 10 నారెంజు మిఠాయి (చెరొక 5),3నువ్వుల ఉండలు(2సత్తి గాడికి,1నాకు) అనుకున్నాం.కొట్టుకు వెళ్ళాం ,ఎన్ని కావాలో ఆడిగాం మొత్తం ఇచ్చిండు,మా దెగ్గర ఉన్న పైసలు మొత్తం ఇచ్చాo. ఇంకొక 20 పైసలు ఇయ్యాలి అని ఆ ఎత్తు పళ్ళ కొట్టువాడు అన్నడు. చిన్నపిల్లలం అని మోసం చేస్తున్నాడు అని నమ్మి మేము అక్కడ నుంచి పారిపోయాం.

ఇంట్లో: 

మా ఇంటి దొడ్లో కి వెళ్ళాం . పిడకల గోడ,పెచ్చూల మేడ మీద సత్తి గాడు తను ముడి కట్టిన అంగీ ని ధులిపితే ఆ నారెంజు మిఠాయి,నువ్వుల ఉండలు రాలాయి.వాటిని తినుకుంటూ కొట్టులో వచ్చిన కొత్త  గోళీల గురించి మాట్లాడుకున్నాం.వెంటనే ఏంకాయమ్మ ఇంట్లో ఒక పెద్ద పిడుగు పడిందని దేవుడు ఏంకాయమ్మని తీస్కెళ్ళిపోయాడని వాళ్ళ నానమ్మ చెప్పింది అని సత్తి గాడు అన్నాడు.ఎప్పుడు దేవుడిని తలుచుకునే మన లెక్కల మాష్టారుని ఎందుకు వదిలేసాడని దేవుడిని తిట్టుకున్నాం.ఇంతలో సత్తి గాడు నువ్వుల ఉండ పొట్లం తెరిచిండు ,దాంతో నా నోట్లో ఉన్న నారింజు మిఠాయి ని పెచ్చుల మేడ మీద జాగ్రత్తగా పెట్టి ఆ నువ్వుల ఉండని నాకుతూ తిన్నాను. అది మొత్తం తిన్నాక నేను ఆ కింద పెట్టిన నారెంజు మిఠాయి ని తినబోతే సత్తి గాడు నన్ను తిట్టి "ఒరేయ్ ! దానికి సున్నం అంటుకుందిరా అలాగే తింటావా ? శుభ్రం చేసి ఇస్తా ఇక్కడ ఇయ్యి "అని.ముందు వాడి చీముడి ముక్కు చేతితో తుడుచుకుని అదే చేతితో నా నారెంజు మిఠాయి ని తీసుకుని వాడి కుడి కాలికి ఆ సున్నం పోయేంతవరకు రుద్ది ఇచ్చాడు.వాడు లేకుంటే తీక్కొడి లాగా ఆ నరేంజు మిఠాయి ని అలాగే తినేవాడిని అనుకున్న.ఈసారి నారెంజు మిఠాయి ఎందుకో ఉప్పగ అయ్యింది.ఇంతలో మొదట అనుకున్న విధంగా కాకుండా నేను రెండు నువ్వుల ఉండలు తీసుకుందాం అనుకున్న కానీ సత్తి గాడిని అడిగితే ఒప్పుకోడు అందుకు నేను ఆ పొట్లం లో ఉన్న నువ్వుల ఉండ ని తీసుకొని కిందికి పరిగెత్తడం మొదలుపెట్టాను.నా వెనకాల వాడు తరుముకుంటు వచ్చాడు.గుమ్మం వైపు ఉరుకుతూ వెనకాల వాడు ఉన్నడెమో చూద్దాం అని వెనకకు తిరిగి చూస్తుంటే మా నాన్న కి తట్టుకుని కింద పడ్డాను.కళ్ళు మెల్లగా తెరిస్తే మా నాన్న పంచ ఎదురుగా ఎత్తు పళ్ళ కొట్టువాడు ఉన్నాడు.లెక్కలు మాకు సరిగ్గ రావని అప్పుడు నాకు అర్థం అయింది.
                  మా నాన్న హస్త రేఖలు అద్భుతంగా ఉన్నాయని నా వీపు చూసి నువ్వుల ఉండ తింటూ సత్తి గాడు అన్నాడు.ఆ 20పైసలు ఇచ్చేసి కొట్టువాడిని మా నాన్న పంపించాడు.అప్పుడే తెలిసింది మా నాన్న కూడా 'కొట్టు'వాడు అని.




Thursday 7 December 2017

నా స్వర విభావరి.......!

ఇలా మొదలు:

"సంజన ! నా గడియారం ఎక్కడ పెట్టినవు " అంటూ ఒక గావు కేక వేసా. సంజన మా ఆవిడ , ఒక ప్రభుత్వ ఉద్యోగి .వారం మొత్తం నేను ఆస్పత్రిలో డాక్టర్ గా తను తన ఉద్యోగం లో అలిసిపోయినందున చిన్న విరామం కొరకు ఒక సంగీత ప్రదర్శన కు వెళుతున్నాము . నాకు పెద్దగా సంగీతం గురించి తెలియదు . ఏదో  జాతీయ గీతం ,ఇంకా చిన్నప్పుడు బడి లో మేడం చెప్పిన రాగం "అ ఆ .... ఇ ఈ...." తప్ప పెద్దగా రాగాలు రావు . కానీ సంజన చిన్నప్పటి నుంచి నాట్యం ,సంగీతం నేర్చుకుంది . వృత్తి ఏదైనా తను ఆ కళా సాధన మాత్రం వదలలేదు.తన పుట్టినరోజు అయినందున చిన్న బహుమానం లాగ ఉంటుంది అని అనుకున్న.

             ఇక  కళా ప్రదర్శన జెరుగుతున్నది "శ్రీసాయి దుర్గా ద్వారకా మండప్" లో . ముందు అది మఠం అనుకున్న కానీ అది ఒక కల్యాణ మండపం. "6:00 గంటలకి మొదలు అవుతుoది ఇప్పుడు 5:15 అయింది తొందరగా తయారు అవ్వు "అని అరిచా.అరగంట నుంచి ఆ గల గల తయారవుతున్న గాజుల శబ్దం వినపడుతోంది కానీ మనిషి కనపడదు . నిన్న నే కొంచం కుడి కాలు కి దెబ్బ తగిలింది దాన్ని నిమురుకుంటు ,టికెట్ వెనకాల 5/- అని రాసి ఆఖరికి చిల్లర ఇయ్యని బస్ కండక్టర్ ని తిట్టుకుంటూ బయట గదిలో కూర్చున్న.ఇంతలో కల్యాణి  వచ్చింది . సంజన ని ముద్దు గా కల్యాణి అని పిలుస్తా.
ఆఖరికి అనుకున్న సమయానికి కాకున్నా 6:15 కి చేరుకున్నాం.

చదస్తపు పెద్దాయన:

                  ఊహించిన దానికి భిన్నంగా అక్కడ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. ఆయన అంతటి విధ్వాంసుడు మరి.దూరంగా ఒక రెండు కుర్చీలు ఖాళీగా కనపడ్డాయి . వెళ్లి కూర్చుంటుంటే పక్కల ఆయన విసుగ్గా మొహం పెట్టాడు . టైం సెన్స్ లేదా అన్నట్టు ఒకసారి గడియారం వైపు ఇంకోసారి నా వైపు చూసాడు. పెద్దాయననే కదా అని ఉరుకున్న లేకపోతే వేరే చోటు కి పోయి కూర్చునేవాడిని.ఆయన ఎడమ సీట్ లో నేను నా పక్కల సంజన కూర్చున్నాం.ఎవరెవరివో ప్రదర్శనలు జేరుగుతున్నాయ్ .అనంతరం విధ్వంసుడు రానే వచ్చాడు.

సుందరం రాక:

                      ఆయన పేరు 'మంచిర్యాల వేణు సుందరం' . ఆయన ఆయన వెనకాల తన శిష్యులు వారి వెనక తబల మృదంగం మొదలగు గానా భజాన బ్యాచ్ ఆశీనులవుతున్నారు. ముందుగా ఒక శిష్యుడు ఆయన ముందర ఉన్న మైక్ లో ఆరోహణ,అవరోహణ మొదలుపెట్టాడు.ఆ బ్యాండ్ మేళం కూడా ఆ తబల పని చేస్తుందో లేదో అని టక్క టక్క కొట్టసాగాడు .అంతా సిద్ధం అనగానే ఆయన మొదలుపెట్టాడు.

సుందరం ఆరోహణ: 

         "ఆ.......... "(కింది స్థాయి ) నుంచి మొదలు పెట్టాడు. ఆయన అలా రాగం అందుకోగానే మా ఆవిడ ఉత్సాహంగా వినసాగింది.ఇవతల వైపు ఉన్న హెడ్ మాస్టర్ కూడా ఒక్క సారి ఊపిరి పీల్చుకున్నాడు. నా కుడి కాలును నేను నిమురుకుంటు ఉన్న.
గొంతు సవరించుకుని ఈ సారి  ఎడమ చేతి తో తాళం వేస్తూ కుడి చేతితో జెల్లడ పడుతూ "అ అ అ ఆ............." అని హెచ్చు స్థాయి కి పోయాడు.అంతే వెంటనే ఆనందం తట్టుకోలేక నా పక్కల అతను నిర్వాణ వచ్చినట్టు గా కళ్ళు మూసుకుని ప్రతి గమకానికి టిక్ మార్క్ కొడుతూ ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో ఆ సుందరం నాకు చిన్నప్పుడు మా మేడమ్ నేర్పిన "ఆ......." రాగాన్నే తిప్పి తిప్పి పాడుతున్నాడు. నా పక్కల అతను తాళం వేస్తూ వేస్తూ అనుకోకుండా ఆ రాగం మత్తులో నా కుడి కాలు ని గెట్టిగా కొట్టాడు.అంతే ఆ నొప్పి తట్టుకోలేక నేను "కల్యాణి" అని అన్న దానికి ఆయన "కాదు ఇది మోహన " అన్నాడు. మా ఆవిడ అంత ఇబ్బంది గా ఉంటే మీరు ఇటు కూర్చోండి అని అన్నది . కానీ తన కాళ్లు నాకంటే సన్నవి అందుకే ధైర్యం చేసి అక్కడనే కూర్చున్న.ఇంతలో సుందరం జల్లడ పట్టడం ఆపేసి కుడి చేతి తో గాల్లో భూమి ని గీస్తూ ఎడమ చేతి తో తాళం వేస్తూ వచ్చిన వాళ్ల మొహాలను అర్థం అయింది అన్నట్టు గా చూస్తూ పాడుతున్నాడు.పక్కల ఆయన అర్థం అయింది అన్నట్టు తల ఊపుతున్నాడు . అలా ఆయన ప్రతి అర్థం అయిందా ప్రశ్న మొహానికి ఈయన మురిసిపోతూ ఉన్న చిరు ముసలి మొహం సమాధానం చెబుతూనే ఉన్నది.

                        హెచూస్తాయి సుందరం 

        పక్క ఆయన పరిచయం:

సుందరం  మొహం లో తను ఎడతెరిపి లేకుండా తీసిన రాగం గర్వం కనిపిస్తూనే ఉన్నా శ్వాస సమస్యతో కొంచం పక్కకి తప్పుకున్నాడు వెంటనే శిష్యులు అందుకున్నారు.దానితో నా పక్కల అతని చేతి కి నా కాలు కి విరామం దొరికింది. అతను  "సుందరం పాడిన ప్రతి రాగం నాకు తెలుసు"అనే గర్వం తో కూడిన ముఖం తో నా వైపుగా తిరిగాడు."తననీ నీ నీ..."  అంటూ చిన్న రాగం తీస్తూ కనుబొమలు ఎలా ఉంది అన్నట్టుగా ఉపాడు. నేను బాగుంది అనడానికి మూతిని వంకరగా పెట్టి నీతిని  ఊపిన. ఒక్కసారిగా భుజం మీద కొట్టినట్టు తట్టి "ఏమి అబ్బాయి ,ఏం సంగీతం వచ్చా?"అడిగాడు.'లేదు ' అన్నాను .'మరి తాళం బాగా వేశావ్ ' అన్నాడు . మీరు వేసిన హెచ్చు స్థాయి తాళానికి నేను ముగ్దుడినయ్ నిమురుకున్న అన్న . ఆయన నవ్వి "నాకు సంగీతం అంటే ఇష్టం అబ్బాయి"అన్నాడు.
"నాకు నా కుడి కాలంటే ఇష్టం " అని చెప్పి చప్పుడు చేయకుండా కూర్చున్న. ఆయన కోపంగా నా వైపు చూస్తున్నంతలో సుందరం మళ్ళీ మైక్ అందుకున్నాడు ఈయన దృష్టి అటు మళ్లింది . అంతలో నేను మా ఆవిడ జారుకున్నాం. 
      
    

                        
                                

Friday 20 October 2017

నవ రసాల్లో కుంకుడు రసం కుడా ఒకటి !!

"వాగీశధ్యం సుమనసహా సర్వార్థానామ్ ఉపక్రమే !
యం నత్వా కృత కృత్యాషు తం నమామి గజానానం !!"
                           కాల కృత్యాలకు ర్హైమింగ్ గా కృత కృత్య ఉందని పెట్టనే తప్ప దాని అర్థం నాకు తెలియదు.(ఇది కచ్చితంగా మతిస్థిమితం తో రాస్తున్నదే)
         ఇక మొదలు పెడితే ,
                ఈ ఒక్క సంపుటిని మనం రెండు గా విభజిదాం :
మొదటిది) కుంకుడు కాయ - రసం పిండుట
రెండు) నా పరిక్షల ఫలితాలు వచ్చిన దినం

గమనిక:పైన ఉన్న భాగాలు ఒక దాని మధ్యలో ఇంకొకటి               వస్తుంటాయి ,వాటిని పోల్చుకోవడం మీ                         మూర్ఖత్వం.
           
    1=>    ముందుగా తగినంత కుంకుడు కాయలను ఒక                పాత్ర లో ఉంచుకోవాలి.
    2=>     (సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద                      సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ) 
                 అని స్వరం వినిపిస్తుంటే  .దాన్ని మాత్రం ఎందుకు కాదనాలని నేను కూడా "విధాత తలపున ప్రభావించినది అనాది జీవన వేదం" అంటూ జలపాతం గట్టున సేద తీరుతున్న . నేను మెల్లగా ఆ నీళ్ళల్లో దిగి ఆ జలాశయం లో ఒక కలువ పువ్వు లా సుకుమారంగా తేలుతూ ఉంటే, మొహం మీద పడే నీళ్లు ఎందుకో 'సరళి స్వరాలు'  నుంచి 'కీర్తనల' కి మారింది .ఆ ధాటిని తట్టుకోడానికి నేను కూడా "అతులిత బలదామం" అంటూ హనుమాన్ చాలీసా మొదలు పెట్టాను.ఆ ధాటి ఇంకా పెరిగి కళ్ళు ముసకపోయి, ఊపిరి ఆడకుండా చేసింది ,నోటి నిండా నీళ్లు ఉండడం తో ఊపిరి ఆడటం లేదు .ఒక్క సారి గా ఉన్న శక్తి మొత్తం ఉపయోగించి బయట పడాలి అనే ప్రయత్నం లో ఆయాస పడుతూ కళ్ళు తెరిచే ప్రయత్నం లో ముందు నాన్న ,నాన్న చేతిలో చెంబు కనిపించాయి.అలా "పచ్చి వెళక్కాయి నోట్లో పడటం" అది కొత్త ఏమి కాదు.వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు విడిచి వెళ్లినట్టుగా, నేను నా మంచం ని విడవాల్సొచ్చింది.గది నుంచి అడుగు బయట పెట్టగానే 'బుస్స్...బుస్స్' అంటూ మా వంటింటి మర్యాద(prestige)  ఖండువ వేస్కుంటున్నది.ఆ శబ్దాల నడుమన నేను నా తిట్లు విడువనా ? అంటూ మా అమ్మ ఆది తాళం ,తిట్లధ్వని రాగం అందుకుంది.

1=> ముందుగా ఉంచుకున్నటువంటి కుంకుడు                         కాయలను పక్కల పెట్టి ,ఒక గిన్నె లో నీళ్లు నింపి                 దాన్ని పొయ్యి మీద ఉడక పెట్టాలి.
2=> శ్రోత గా మంచి పేరు ఉన్న నన్ను  'అమ్మ దండకం' అంతగా మెప్పించలేక పోయింది.ఎదో మరచి పోతున్న అనే భావన తో నా పళ్ళు తోముటకు ఉపయోగించే కుంచె ను వెతకడం మొదలు పెట్టాను. నిస్వార్తురాలు ,ఎప్పుడు నా పళ్ళు తోమాలని చూస్తుందే తప్ప దాని పళ్ళు చింపిరి గా ఉన్నాయ్ అని గమనించుకోలేని అమాయకురాలు.అన్ని కృత్యాలు ముగించుకుని పాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు ,నాన్న ఒక 'దక్షిణ మధ్య రైల్వే కి పెద్ద దిక్కు అయిన స్టేషన్ లో తన ధూమశకటానికి స్థానం దొరకని  చోదకుడి' లా గుర్రు మని చూస్తూ పోతున్నాడు.నేను అమ్మని పాలు అని అడగడం తో తను నేను క్రీస్తుపూర్వం 'అజాతశత్రు' మగధ సామ్రాజ్యాన్ని పాలిస్తూ తన తండ్రి ని బంధించిన క్షణంలో
నేను చేసిన తప్పుల్ని వెలికితీయడం తో,నిస్సహాయుడిని అయి తల వంచి,చెయ్యి లేపి ,చేత గ్లాస్ పట్టి, పంచదార వేసి,పాలు పోసి ,కలుపుకుని తాగాల్సిన స్తితికి చేరుకున్న.కాలు మీద కాలు వేసుకుని దర్జాగా మా ముక్కుపచాలారి ముదిరి ముసలి ముతుక గొంతు తో వాగుతున్న  దూరదర్శన్ ని చూస్తూ ,చేత 'స్వయం కృషి'(పాల గ్లాస్) పట్టుకుని ఉండగా మళ్ళీ రాముడు భీముడు లో రాజనాల లా నన్ను చూస్తూ తూర్పు ద్వారం వైపు అడుగులు వేసి ముసలి ప్రాణం అనే జాలి లేకుండా మా దూరదర్శన్ పీక నొక్కాడు నాన్న.ఇంత సేపు మరిచిన విషయం ఆ దెబ్బతో గుర్తుకు వచ్చింది ,ఆ రోజు నా పరీక్ష ఫలితాలు వచ్చే రోజు.


1=>ఉడుకుతున్న ఆ కుంకుడి గింజల మీద బాగా నురుగు పెరుకపోతుంది.
2=>పరిస్థితి అర్థమయింది.నేను చిల్లులున్న పడవలో ఉన్న జాలరి లా ఉన్న ,నన్ను నేను నమ్ముకుంటే బ్రతుకుతా లేదంటే మునిగి పోతా.తీరికగా అస్సలు ఏమైనా రాసినాన?అని ఆలోచించడం మొదలు పెట్టిన.
అడిగినప్పుడు ముందరివాడు చూపియలేదనే బాధ తప్ప ఏమీ గుర్తుకు రాలేదు .ఫలితాలు 12 గంటలకు వస్తాయి ఇప్పుడు 9:00 అవుతున్నది.ఈ మూడు గంటలని సరిగ్గా వాడుకోవలనుకున్న. కళ్ళకి మా అమ్మమ్మ చత్వారం కళ్ళజోడు పెట్టుకుని ,పంచె కట్టుకుని, ఎదో గొప్ప పని చేసేవాడిలా మూతి పెట్టి గోవింద నామాలు,విష్ణుసహస్రనామం,ఆదిత్య హృదయం చదివి మొదటి గంటలో దేవుడికి నన్ను ప్రోత్సహించడం తప్ప వేరే అవకాశం లేకుండా చేసిన . వెంటనే ఆ చత్వారం కళ్ళజోడు, దేవుడి పుస్తకాలు పక్కన పెట్టి ఒక రుద్రాక్ష ని మెడలో వేసుకుని కుడిచేత ఒక భూతద్దాన్ని పట్టి ఎడమ చేతి రేఖలు ,ఎడమ చేత పట్టి కుడి చేతి రేఖలు ,రెండు చేతులని ఉపయోగించి పక్కింటి రేఖను చూసాను.నాకు అర్థమయినంతలో పక్కింటి రేఖ తప్ప మిగతావి బాగలేవు.ఈ దెబ్బ తో ఆత్మస్థైర్యంన్ని కొలిపోకూడదని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ రేఖని ఇంకొక 5 నిమిషాల చూసాను. మూడవ గంటలోకి ప్రవేశించిన ఇది చాలా కీలకమయినది ఎందుకు అంటే రెండవ గంట విడిచిన మధుర జ్ఞాపకాలను మరిచి దీని పైన దృష్టి సారించాలి కాబట్టి.ఇది చాలా గొప్ప ఘట్టం దీనిలో మనం 'ఒక వేళ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగని చో' అనే వాక్యాన్ని శీర్షిక గా వాడతాం.ఇంకొక గంట పాటు ఎన్నో అంచనాలు వేసుకుని పక్కింట్లో రేఖ లేకున్నా బతకాగలనన్నే ధైర్యాన్ని తెచుకో వలసిన క్షణం.చూస్తూనే 12 కొట్టింది.

1=>ఇప్పుడు ఆ కుంకుడు రసాన్ని ఒక పాత్రలో వడియ పోయలి. ఎంతో శ్రేష్టమైన కుంకుడు రసం రెడి.
2=>కుటుంబం మొత్తం గణిని(computer) ముందు కూర్చున్నాము.నాన్న నా హాల్-టికెట్ పట్టుకుని ఫలితాల కోసం చూడడం మొదలు పెట్టాడు .అమ్మ నోట జపం చేస్తూనే ఉంది .అయిపోయే నా ఫలితం వచ్చింది ,నేను స్నానం చేయకుండా చేసిన జపం మహాత్యమో లేక రేఖ సాంగత్యమో తెలియదు కాని నేను అన్ని పాస్ అయ్యాను .నా ఆనందాలకి హద్దులు లేవు .ఒక్కసారిగా పాలు అమ్మ కలిపి ఇచ్చినట్టుగా అనిపించింది,నాన్న నే "రారా !వచ్చి దూరదర్శన్ చూడు "అన్నట్టు వినిపిస్తుంది.ఒక్కసారిగా ఒక పెద్ద బరువు నా చెంప మీద వాలినట్టుగా ,కళ్ళు తిరిగినట్టుగా,మూర్ఛ వచ్చి పడిపోతున్నట్టుగా ఒకేసారి అనిపించింది అదేంటో తెలుసుకోడానికి 3 గంటల తరువాత లేచినాక అర్ధం అయింది నాన్న నా నుంచి 90% ఆశించినడని.
   
                                 సమాప్తం!